వాసూ..గంజాయి నేరగాళ్ళతో ఏమిటి సంబంధం?!
-గంజాయి కేసులో అడ్డంగా బుక్కైన వారితో ఆలింగనాలా?
-అవినీతి చరిత్ర వారిది..నిందారోపణలు తనపై..
-ఒక పోలీసు అధికారితో మాట్లాడిన ఆడియో ఫేస్ బుక్ లో పెట్టడం చట్టరీత్యా నేరం..-
-పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా
-మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ భరత్
ఏపీ పబ్లిక్ న్యూస్ : రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా
రాజమండ్రి, మార్చి 22: హైదరాబాదు గంజాయి కేసులో అడ్డంగా బుక్కైన జాకీ, చోటు వీరంతా రాజమండ్రి వాళ్ళే కదా..టీడీపీ ఆదిరెడ్డి వాసుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారే..ఇప్పుడు కాదంటే ఎలా అంటూ రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ను ఉద్దేశించి రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. శుక్రవారం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారాన్ని యధేచ్చగా సాగిస్తున్నది టీడీపీ నేతలనే విషయం ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. మొన్న హైదరాబాద్ లో రాజమండ్రి టీడీపీకి చెందిన జాకీ, చోటు పట్టుబడ్డారన్నారు. ఈ ఇద్దరితో ఆదిరెడ్డి వాసుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ..వారితో ఆదిరెడ్డి వాసు తీయించుకున్న ఫొటోలను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒక ఫొటోలో చోటు, వాసు దండలు వేసుకుని ఉన్నారు. మరో ఫొటోలో వాసు, చోటు ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంది. ఇటువంటి పలు చిత్రాలను ఎంపీ భరత్ మీడియాకు చూపిస్తూ..గంజాయి మాఫియాకు డాన్ వాసు అని, ఇటువంటి నేర చరిత్ర కల్గిన వాళ్ళను రాజకీయాలలోకి రావడం అత్యంత ప్రమాదం అన్నారు. దండల వరకూ అంటే ఏదో ఒక కార్యక్రమంలో అనుకోవచ్చు..కానీ ఆలింగనాల వరకూ వచ్చిందంటే ఆ స్నేహం వెనుక చీకటి కార్యకలాపాలపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయన్నారు. ఇది కాకుండా ఒక పోలీసు అధికారికి ఆదిరెడ్డి వాసు ఫోన్ చేసి మాట్లాడి..మళ్ళా ఆ ఆడియో రికార్డును తన అఫీషియల్ ఫేస్ బుక్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ పైకి తీసుకు రావడం నేరమే అన్నారు. విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారితో మాడ్లాడి, సదరు అధికారి అనుమతి లేకుండా ఫేసు బుక్ లో పెట్టడం రాజద్రోహం కిందకు వస్తుందన్నారు. ఐపీసీ 54, ఐపీసీ 353, 123 ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించవచ్చునని ఎంపీ భరత్ తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణా డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలకు పాల్పడేది ఆదిరెడ్డి కుటుంబం అని, పైపెచ్చు తనపై నిందారోపణలు చేయడం చూస్తుంటే వారి మనస్తత్వం ఎలాంటిదో ప్రజలు గ్రహిస్తున్నారు అన్నారు.
చేసిన అభివృద్ధి చెప్పుకోకూడదట..!
నగరంలో ఒక ఎంపీగా ఈ అయిదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పుకోవడం కూడా ఆదిరెడ్డి అప్పారావు, వాసులకు నేరమేనట అన్నారు. ప్రతీ విషయాన్ని భూతద్దంలో నుండి చూపిస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఆదిరెడ్డి కుటుంబం 16 సంవత్సరాలు మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అధికారాలను వెలగబెట్టి నగరానికి గానీ, ప్రజలకు కానీ ఒక్క మంచి పని చేయలేదన్నారు. ఇదేదో రాచరిక వ్యవస్థ మాదిరిగా కుటుంబ పాలనలా ఆ కుటుంబమే అధికారాన్ని అనుభవించాలన్నట్టు భావించడం వారి అహంకారాన్ని వెల్లడిస్తోందన్నారు. కమీషన్ల నీఛ సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదన్నారు. అదే దృష్టితో తనపైనా అభాండాలు వేస్తున్నారని..25 శాతం కాదు, ఒక్క శాతం.. కనీసం అర శాతం కమీషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే కాదు శాశ్వతంగా రాజమండ్రినే వదిలేస్తాను అన్నారు. నగరానికి ఏమి అభివృద్ధి చేశానో 20కి పైగా చెబుతానని, టీడీపీ ఆదిరెడ్డి కుటుంబాన్ని చెప్పమనండి అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. ప్రజాభిమానం మెండుగా తనకు ఉండటంతో కడుపుమంటతో ఏదో ఒక ఆరోపణ, విమర్శ, ఫిర్యాదులు చేయడం పనిగా ఆదిరెడ్డి కుటుంబం పెట్టుకుందని, వీటన్నిటికీ ప్రజలే సరైన సమాధానం చెప్పే రోజులు ఆసన్నమవుతున్నాయని ఎంపీ భరత్ అన్నారు.