హరిత విప్లవం.. మహా యజ్ఞంగా కొనసాగాలి

 హరిత విప్లవం.. మహా యజ్ఞంగా కొనసాగాలి

- మీడియా సమావేశంలో క్రికెటర్ అంబటి రాయుడు..





ఏపీ పబ్లిక్ న్యూస్, నవంబర్ 03, రాజమహేంద్రవరం :

రాజమండ్రి, నవంబరు 3: దేశ వ్యాప్తంగా కాలుష్యం చుట్టుముట్టి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్న వేళ హరిత విప్లవం మహా యజ్ఞంగా ప్రతీ ఒక్కరూ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. రాజమండ్రి నగరంలోని తిలక్ రోడ్డులో ఎంపీ భరత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన 'యువత హరిత' (గో గ్రీన్ ఛాలెంజ్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా విస్తరించినప్పుడే యావత్ భారతదేశం పచ్చగా కళకళలాడుతుందని క్రికెటర్ అంబటి అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వచ్చేటప్పుడు దారి పొడవునా పచ్చని మొక్కలు చూస్తే ఎంతో సంతోషం వేసిందన్నారు. కాలుష్య రహిత నగరంగా గుర్తింపు పొందాలంటే చక్కని ఆక్సిజన్ అందజేసే మొక్కలు చాలా అవసరమని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా యువత హరిత కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని ప్రధాన సెంటర్లు, రహదారులలో మొక్కలు నాటి, వాటి పరిరక్షణ బాధ్యత విద్యార్థులకు ఇవ్వడం ఒక మంచి కార్యక్రమమని అన్నారు. చక్కని మొక్కలతో పాటు, నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు ఎంపీ భరత్ చేయడం వల్ల రాజమండ్రి అద్భుత నగరంగా కనిపిస్తోందన్నారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'జగనన్న హరిత నగరాలు' కార్యక్రమ స్ఫూర్తితో 'యువత హరిత' కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక నిధులతో పాటు నగర పాలక సంస్థ నిధులతో రాజమండ్రి నగర రూపు రేఖలను సమూలంగా మార్చివేశామన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలో రాజమండ్రి నగర ముఖ చిత్రం మార్చామన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఒక్కో మొక్క నాటి దానిని సంరక్షిస్తే కాలుష్య రహిత దేశంగా గుర్తింపు పొందుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ప్రతీ ఒక్కరిలో ఈ భావన, స్ఫూర్తి రావాలన్నారు. రాజమండ్రి నగరంలో తిలక్ రోడ్డు వాణిజ్యపరంగా ఎంతో పేరున్న ప్రాంతమని, అటువంటి ప్రధాన రహదారి డివైడర్లలో మొక్కలు నాటడం..ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ భరత్ అన్నారు.