తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవు - ఎంపీ భరత్
- ఆ వృద్ధురాలి ప్రమాదాన్ని సీఎం సభతో లింకు పెడతారా?
- టీడీపీ నేతల చిల్లర రాజకీయాలు ఇవే
- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్
ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి, జనవరి 4: రాజమండ్రిలో సీఎం జగన్ సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష టీడీపీ నేతలు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై డిటర్మినేషన్ కేసులు వేస్తామని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. మంగళవారం నగరంలో సీఎం సభాస్థలి ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తే లాలా చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని సీఎం సభతో లింకుపెట్టడం చాలా దారుణమన్నారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సమీపానికి చెందిన వృద్ధురాలు పార్వతిని కుక్క కరిస్తే ఇంజక్షన్ చేయించుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్ళేందుకు లాలా చెరువుకు వచ్చి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుండి కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఇది దురదృష్టకర సంఘటన. అయితే ఈ వృద్ధురాలు సీఎం సభకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగినట్టు టీడీపీ దుష్ప్రచారం చేయడాన్ని ఎంపీ భరత్ తీవ్రంగా ఖండించారు. అసలు ఆ వృద్ధురాలికీ, పార్టీకి గానీ సీఎం సభకు గానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. అయినా మానవత్వంతో ఆ వృద్ధురాలికి నాణ్యమైన వైద్యం అందేలా చూస్తున్నామని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్ళి వృద్ధురాలిని పరామర్శించారని తెలిపారు. టీడీపీ నేత చంద్రబాబు సభలలో తొక్కిసలాట జరిగినట్టు సీఎం జగన్ సభలో కూడా జరగాలని కోరుకుంటున్నారేమో, ఇదేమి కోరికో తెలియడం లేదన్నారు. ఎవరైనా మరణిస్తే బాధపడాలే కానీ ఇలా శవ రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఏదేమైనా ఇకపై ఇటువంటి తప్పుడు దుష్ర్పచారాలు చేసే వారెవరైనా సరే డిటర్మినేషన్ కేసు పార్టీ తరఫున, ప్రభుత్వం తరపునా వేస్తామని ఎంపీ భరత్ హెచ్చరించారు.