ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో కీలక పరిణామం
ఏపీ పబ్లిక్ న్యూస్ : న్యూఢిల్లీ
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్, ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రం సమయం కోరింది. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
కేంద్రం వైఖరి ఏమిటి!?
అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఏదో ఒక వైఖరి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని న్యాయవాదులు స్పష్టం చేశారు. నిజానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రాన్ని టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించాలన్న సీలింగ్ ఉందని చెబుతోంది. కేంద్ర న్యాయ శాఖ కూడా గతంలో ఒకసారి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వాదనను టీఆర్‌ఎస్ తిప్పికొడుతోంది. రాజ్యాంగంలోని 3వ అధికరణ మేరకే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, తద్వారా, రాజ్యాంగంలోని అన్ని అంశాలను సవరించినట్లేనని, ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అవసరం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జమ్ము కశ్మీర్ విభజన చట్టం 2019లో పేర్కొన్న నిబంధన మేరకు ఎటువంటి రాజ్యాంగ సవరణ లేకుండానే అక్కడ సీట్ల పెంపునకు కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేస్తున్నారు.