అన్నకు నివాళి (జనవరి 18 న శ్రీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా)

అన్నకు నివాళి (జనవరి 18 న శ్రీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా)

 



నేడు యన్.టీ.ఆర్.వర్ధంతి...

రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.

రాజకీయ రంగ ప్రవేశం

1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.

1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.

అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు అతనుకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవాడు. దానిని అతను "చైతన్యరథం" అని అన్నాడు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.