ఏపీ పబ్లిక్ న్యూస్ : దెందులూరు
దెందులూరు మండలంలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు దెందులూరు ఎస్ఐ ఇజ్జపు వీర్రాజు తెలిపారు. బుధవారం దెందులూరు పోలీస్ స్టేషన్ ఎస్సై వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ మండలంలోని శివారు ప్రాంతాల్లో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, అసాంఘిక కార్యక్రమాల కేసులు నమోదు అవుతున్నాయన్నారు.
వీటిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నైట్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా నేరాలు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వారి సమాచారాన్ని తక్షణం పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఎస్ఐ వీర్రాజు సూచించారు.
నేరాల నియంత్రణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. నేరాలను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈనెల 16వ తేదీన కొవ్వలి వన్, దెందులూరు వన్ ఎంపిటిసి స్థానాలకు, గోపన్నపాలెంలో ఒక వార్డుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురిని బైండోవర్ చేసినట్లు చెప్పారు.
ఎటువంటి ఘర్షణలు జరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా కృషి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు.